: పెవిలియన్ కు వరుస కట్టిన లంక పులులు... 85 ఏళ్ల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి సమయం!
85 సంవత్సరాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ సాధ్యం కాకుండా, కలలా మిగిలిపోయిన విదేశాల్లో 'వైట్ వాష్' విజయం మరికొన్ని గంటల్లో భారత్ ముందు నిలవనుంది. శ్రీలంకతో రెండు టెస్టులను గెలుచుకుని, మూడో టెస్టులో సంపూర్ణ అధిపత్యానికి భారత్ చేరుకుంది. ఫాలో ఆన్ లో పడి, మూడో రోజు ఆటను ప్రారంభించిన లంక ఆటగాళ్లు వరుసగా పెవీలియన్ దారి పట్టారు.
తరంగ 15 పరుగుల వద్ద అవుట్ కాగా, 26 పరుగుల వద్ద కరుణరత్నే, 34 పరుగుల వద్ద పుష్పకుమార, 39 పరుగుల వద్ద మెండిస్ పెవీలియన్ దారి పట్టారు. ప్రస్తుతం మ్యాథ్యూస్ 12, చండిమల్ 13 పరుగులతో ఆడుతుండగా, లంక స్కోరు 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు. భారత్ సాధించిన స్కోరును అందుకోవాలంటే లంక ఇంకా 286 పరుగులు చేయాల్సి వుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ స్కోరును లంక చేరుకోవడం దాదాపు అసాధ్యం. ఇక ఎనిమిదిన్నర దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కళ్ల జూడని అరుదైన రికార్డు ఎప్పుడు చేతికందుతుందన్న విషయమై మరికొంత సమయం వేచి చూడాల్సిందే.