: యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్టే!
సుమారు మూడు సంవత్సరాల తరువాత, ఈ సంవత్సరం ప్రారంభంలో భారత క్రికెట్ జట్టులోకి వచ్చి, వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ ఇక ముగిసినట్టేనా? అంటే, అవుననే అంటున్నారు క్రీడా పండితులు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తరువాత, ఐదు వన్డేల సిరీస్ లో యువీకి స్థానం లభించలేదు. మరో రెండేళ్లలో జరిగే వరల్డ్ కప్ ను దష్టిలో ఉంచుకుని కుర్రాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యువరాజ్ ను పక్కన పెట్టింది.
దీంతో యువరాజ్ ఇక భారత క్రికెట్ వన్డే జట్టులోకి మరోసారి వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన కెరీర్ ఇక ముగిసినట్టేనని చెబుతున్నారు. కాగా, యువరాజ్ కన్నా వయసులో పెద్దవాడైన మహేంద్ర సింగ్ ధోనీని మాత్రం జట్టులో కొనసాగించాలనే సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. దినేష్ కార్తీక్ పైనా వేటు పడగా, రిషబ్ పంత్ ను ఎంపిక చేయలేదు. కాగా, ఈ నెల 20 నుంచి ఐదు వన్డేల సిరీస్ మొదలు కానున్న సంగతి తెలిసిందే.