: రాజకీయాల్లోకి వస్తాను... బీజేపీ తరపున తెలంగాణలో పోటీ చేస్తాను: శివాజీ రాజా
తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తెలిపాడు. గత 20 ఏళ్లుగా తాను బీజేపీలో ఉన్నానని, ప్రతి ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నానని అన్నారు. కృష్ణంరాజుగారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే తాను బీజేపీలో చేరానని, గతంలో రామానాయుడుకు కూడా ప్రచారం చేశానని చెప్పారు. ఏపీలో పుట్టినా కేవలం 15 ఏళ్లు మాత్రమే అక్కడ ఉన్నానని, తరువాత జీవితమంతా తెలంగాణలోనేనని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇష్టమని, అలాగని చెప్పి ఆ పార్టీవైపు వెళ్లే ప్రసక్తి లేదని చెప్పారు. బీజేపీ తరపునే పోటీ చేయాలని ఉందని, ఇప్పటికైతే ఆఫర్ కూడా ఉందని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని చెప్పారు. నిజాయతీగా, ముక్కుసూటిగా, మంచితనంగా ఉండడం పరికిరాదని తన స్నేహితులంతా తనకు చెబుతుంటారని, అయితే ఆ లక్షణాలే తనను మా అధ్యక్షుడిని చేశాయని, అవే లక్షణాలతో తాను రాజకీయాల్లోకి వస్తానని శివాజీ రాజా తెలిపారు.