: రాందేవ్ బాబా గడ్డాన్ని పట్టుకున్న దలైలామా.. ఫన్నీ వీడియో చూడండి!
ఈ రోజు ముంబైలో ప్రపంచ శాంతి, సామరస్య సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బౌద్ధగురువు దలైలామా, భారత యోగా గురువు రాందేవ్ బాబా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికరమైన సన్నివేశం సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో రాందేవ్ బాబా గడ్డాన్ని దలైలామా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పొట్టపై సరదాగా తట్టడంతో.. రాందేవ్ తన పొట్టపై వున్న ఆచ్చాదనను తొలగించి చూపించి, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన తన మార్కు యోగా ఫీట్ ను చేసి చూపించారు.
కాగా, ఈ సమ్మేళనంలో రాందేవ్ బాబా మాట్లాడుతూ చైనాపై మండిపడ్డారు. ఆ దేశానికి శాంతి, సామరస్యం అంటే ఏమిటో తెలియదని అన్నారు. చైనాకు ఆ విషయం తెలిసి ఉంటే దలైలామా భారత్లో ఆశ్రయం పొందాల్సిన అవసరమే వచ్చేదికాదని తెలిపారు. అందుకే ఆ దేశంతో ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ’ అన్న చందంగానే వ్యవహరించాలని, శాంతియుతంగా చెబితే అర్థం చేసుకోలేనివాళ్లకు యుద్ధంతోనే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో దలైలామా మాట్లాడుతూ... ప్రపంచంలో అశాంతికి హింసావాదమేనని కారణమని పేర్కొన్నారు. భయం విసుగును పుట్టిస్తుందని, దాని వల్ల కోపం పుడుతుందని, కోపం మనిషిని హింసవైపునకు నడిపిస్తుందని ఆయన తెలిపారు. అందుకే ప్రజలందరూ భయం లేకుండా జీవించాలని అన్నారు.