: ఆడపాము తనపై పగబట్టిందట.. సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడు!
ఓ ఆడపాము తనపై పగబట్టిందన్న భయంతో ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఓ యువకుడు (24) తనకు రక్షణగా నలుగురు సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడు. ఆ యువకుడు ఎక్కడికెళ్లినా ఆ నలుగురు గార్డులు తుపాకులతో కాపలా కాస్తున్నారు. తాను గత ఏడాది ఓ మగ పామును చంపానని, అప్పటి నుంచి ఓ ఆడ పాము తనపై పగబట్టి చంపాలని చూస్తోందని ఆ యువకుడు చెప్పాడు.
ఆ మగపామును తాను చంపి వెళుతున్న సమయంలో ఆడ పాము తనని కొన్ని కిలోమీటర్ల మేర వెంబడించిందని అన్నాడు. అనంతరం పలుసార్లు తనను కరవడానికి ప్రయత్నించిందని తెలిపాడు. ఆ పామంటేనే భయపడిపోతున్న ఆ యువకుడు దానిని చంపినవారికి రూ.5000 రివార్డు కూడా ఇస్తానని ప్రకటించాడు. ఆ యువకుడి తీరుపై ఆ జిల్లా అధికారులు స్పందించి... ఆ ప్రాంతంలో వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయని తెలిపారు. ఆ యువకుడిపై పాము దాడి చేయాలని చూస్తోందనే విషయం అసత్యమని చెప్పారు.