: సినిమాల్లో అవకాశమిస్తామంటూ మోసం.. స్టాఫ్ నర్సు తో అశ్లీల షార్ట్ ఫిల్మ్స్!
సినిమాల్లో అవకాశం ఇస్తామంటూ మాయ మాటలు చెప్పి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న ఓ యువతిని మోసగించిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు .. ఇరవై నాలుగు సంవత్సరాల ఓ యువతి ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. ఆమె తమ్ముడి ద్వారా లోక్ నాథ్ పరిచయం అయ్యాడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ ఆ యువతిని తన తల్లి విజయలక్ష్మి వద్దకు లోక్ నాథ్ తీసుకువెళ్లి పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఆమెకు ఓ సినిమాలో చిన్నపాత్రలో నటించే అవకాశం కల్పించడమే కాకుండా, మూడు వేల రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు.
దీంతో, వారిపై ఆ యువతికి నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించేందుకూ ఆ యువతి అంగీకరించింది. ఆ యువతితో ఓ తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్న విజయలక్ష్మి, యూనిట్ సభ్యులతో ఆమెను షూటింగ్ కు పంపింది. అయితే, గుర్తుతెలియని ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లి వారు అసభ్యంగా ప్రవర్తించారు. వెంటనే విజయలక్ష్మికి ఫోన్ చేసిన బాధితురాలు ఈ విషయాన్ని చెప్పగా, ‘వాళ్లు ఎలా చెబితే అలా చెయి. లేకపోతే, వేరే కేసులో ఇరికిస్తాను’ అంటూ విజయలక్ష్మి బెదిరించింది.
గత్యంతరం లేని పరిస్థితుల్లో యూనిట్ సభ్యులు చిత్రీకరించిన పది అశ్లీల షార్ట్ ఫిల్మ్స్ లో ఆ యువతి నటించాల్సి వచ్చింది. దర్శకుడు దుర్గారావు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తన పరువు పోతుందన్న భయంతో ఆ యువతి గోప్యంగా ఉంచింది. ఆన్ లైన్ లో ఆ షార్ట్ ఫిల్మ్స్ ఇటీవల పెట్టారు. ఈ విషయాన్ని ఆ యువతి పని చేస్తున్న ఆసుపత్రి సిబ్బంది, అక్కడి మేనేజర్ గుర్తించారు. దీంతో, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు వ్యవహారమై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ సునీత చెప్పారు.