: సర్జికల్ స్ట్రయిక్స్ గురించి మనోహర్ పారికర్‌కు ఏం తెలీదు: గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌లోని ఉరీ ప్రాంతంలోకి ప్రవేశించి సైనికుల ప్రాణాలను తీసిన ఘటనకు ప్రతీకారంగా పీవోకేలో ఉగ్ర శిబిరాలపై ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, త్వరలోనే ఆయన పనాజీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు తమ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్న గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ పలు వ్యాఖ్యలు చేశారు.
సర్జికల్ స్ట్రయిక్స్ గురించి మనోహర్ పారికర్‌కు అసలేం తెలీదని ఆయన అన్నారు. ఆ సర్జికల్ స్ట్రయిక్స్ జాతీయ భద్రతా విభాగంతో పాటు ప్రధాని కార్యాలయ సిబ్బంది నేతృత్వంలోనే జరిగిందని చెప్పారు. పారికర్ మాత్రం ఆ గొప్పదనం అంతా తనతో పాటు మోదీది, ఆర్ఎస్ఎస్ దని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. పారికర్ రక్షణ మంత్రిగా విఫలం అయి, మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.