: ‘జయ జానకి నాయక చిత్రం’లో దివిసీమను అద్భుతంగా తెరకెక్కించారు: ఏపీ ఉపసభాపతి మండలి
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన జయ జానకి నాయక సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను కృష్ణా జిల్లా దివిసీమలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఏపీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ, పవిత్ర సాగర సంగమక్షేత్రాన్ని ఈ చిత్రంలో బోయపాటి శ్రీను అద్భుతంగా తెరకెక్కించారని, ఈ సినిమా ద్వారా దివిసీమకు మరింత ప్రాచుర్యం కలుగుతుందని అన్నారు. దివిసీమ విశిష్టతను ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసే అవకాశం లభించిందని అన్నారు.
ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తన శ్లోకం ద్వారా దివిసీమ ఔన్నత్యాన్ని కళ్లకుకట్టినట్టు చెప్పారని అన్నారు. ఈ చిత్రం విడుదల ద్వారా దివిసీమ పర్యాటకంగా మరింత ప్రాచుర్యం పొందుతుందనే ఆశాభావాన్ని మండలి బుద్ధప్రసాద్ వ్యక్తం చేశారు. దివిసీమలో ఈ చిత్రాన్ని నిర్మించినందుకు గాను బోయపాటి శ్రీను, సాయి శ్రీనివాస్ లకు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ సినిమాను బుద్ధప్రసాద్ సహా పలువురు ప్రజాప్రతినిధులు అవనిగడ్డలో నిన్న తిలకించారు.