: నవాజ్ షరీఫ్ ర్యాలీలో అపశ్రుతి!
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ చేపట్టిన ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొనడంతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. లాలామూస వద్ద డివైడర్ దాటుతున్న బాలుడిని కాన్వాయ్ లోని ఓ కారు ఢీకొట్టింది. దీంతో, ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. విదేశాల్లో అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నవాజ్ షరీఫ్ గద్దె దిగారు. ఈ నేపథ్యంలో, ప్రజల మద్దతును కూడగట్టేందుకు బహిరంగసభలు, ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న గుజ్రాత్ లోని సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాలుడి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, వారిని అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా షరీఫ్ తెలిపారు.