: రాజకీయ పార్టీ పెట్టనున్న కన్నడ నటుడు ఉపేంద్ర.... స్వయంగా వెల్లడి
సొంతంగా అవినీతి రహిత రాజకీయ పార్టీ ఏర్పాటుచేసి, రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని కన్నడ నటుడు ఉపేంద్ర చెప్పారు. ఒక ఆడియో మెసేజ్ ద్వారా ఆయన విషయాన్ని వెల్లడించారు. 13 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియో మెసేజ్ లో ఆయన రాజకీయ రంగప్రవేశం ఎందుకు చేయాలనుకుంటున్నారనేది వివరించారు.
`మన నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కావాల్సిన విద్యార్హతలు లేకున్నా పర్లేదు. కానీ వారికి వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి కనీస అవగాహన ఉండాలి` అని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నేతలకు తమ నియోజకవర్గం మీద ఉన్న అవగాహన ఆధారంగా వారికి ఒక పరీక్ష పెట్టి తర్వాతే టికెట్ ఇవ్వాలని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి డబ్బు రావడం వల్ల వ్యవస్థ చెడిపోయిందని, అలాంటి వారిని ప్రోత్సహించకుండా, ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేసే వారికి ప్రాధాన్యమివ్వాలని ఆయన ఆడియోలో సూచించారు.
`అలా పని చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు మీ నమ్మకం కావాలి. పార్టీ ఫండ్ అవసరం లేని రాజకీయ పార్టీని నేను పెడతాను. ఇతర పార్టీల్లా నేను పెద్ద పెద్ద మీటింగులు పెట్టను. కేవలం పత్రికలు, సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ద్వారానే నా ప్రచారం కొనసాగిస్తాను` అని ఉపేంద్ర అన్నారు. శనివారం సాయంత్రంలోగా తన పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను ఉపేంద్ర వెల్లడించనున్నట్లు సమాచారం.