: ఆధార్ నెంబర్ రాయలేదని సిద్ధాంత వ్యాసాన్ని తిరస్కరించిన జేఎన్‌యూ!
ఆధార్ నెంబర్ రాయకపోవడంతో తన ఎం.ఫిల్ డిసర్టేషన్ (సిద్ధాంత వ్యాసం)ను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ యంత్రాంగం తిరిగి పంపిందని విద్యార్థిని షెహ్లా రషీద్ సోషల్ మీడియాలో తెలిపారు. తనకు ఆధార్ నెంబర్ లేదని, అందుకే డిసర్టేషన్ మీద నింపలేదని ఆమె పేర్కొన్నారు. డిసర్టేషన్ ధ్రువీకరణకు ఆధార్ తప్పనిసరనే నియమం లేకపోవడంతో తాను పెద్దగా పట్టించుకోలేదని, ఈ కారణంగా తన వ్యాసాన్ని తిప్పి పంపడం ఒక రకంగా వేధింపు చర్యేనని రషీద్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా రషీద్ డిసర్టేషన్‌ను తిప్పి పంపడానికి సరైన కారణాలను యూనివర్సిటీ ఇంకా వెల్లడించలేదు. ఒకవేళ ఆధార్ నంబర్ రాయకపోవడమే కారణమైతే షెహ్లా రషీద్‌తో పాటు చాలా మంది డిసర్టేషన్ కాపీలు వెనక్కి రావాల్సినట్లు తెలుస్తోంది. విద్యా సంబంధ ధ్రువీకరణలకు ఆధార్ తప్పనిసరి కాదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి నిజమే, కాకపోతే డిసర్టేషన్ ధ్రువీకరణకు సంబంధించి తాము విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఆధార్ నెంబర్ తప్పనిసరిగా రాయాలని పేర్కొన్నట్లు యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.