: ముఖ్యమంత్రి ప‌ద‌వి నీకు అంద‌నిది!: జ‌గ‌న్‌పై దేవినేని ఉమ మండిపాటు


నంద్యాల ఉపఎన్నిక‌ల ప్ర‌చారంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై మంత్రి దేవినేని ఉమ మండిప‌డ్డారు. జ‌గ‌న్ నోటికొచ్చిన‌ట్లు, స‌భ్య‌స‌మాజానికి ఇబ్బంది క‌లిగేలా మాట్లాడుతున్నాడ‌ని, ఈ విష‌యాల‌న్నింటినీ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్తామ‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా ముఖ్య‌మంత్రి క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వాన్ని న‌డిపిస్తుంటే ఏనాడైనా బాధ్య‌త‌గ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీగా రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణాత్మ‌క పాత్ర పోషించావా? అని దేవినేని ప్ర‌శ్నించారు.

దేశ ప్ర‌ధాని హాజ‌రైన అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి ఎందుకు హాజ‌రుకాలేద‌ని ఆయ‌న అడిగారు. ప్ర‌జాప్ర‌యోజ‌న వేడుక‌ల కంటే బ‌య‌టి వేడుక‌ల‌కు జ‌గ‌న్ స‌మ‌యం కేటాయించ‌డాన్ని దేవినేని త‌ప్పుబ‌ట్టారు. `నీ తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డింది నువ్వు, అవినీతి కేసుల‌తో ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు వెళ్లేది నువ్వు!` అంటూ జ‌గ‌న్‌పై దేవినేని విరుచుకుప‌డ్డారు.

 రాజ‌శేఖ‌ర్ రెడ్డి, జ‌గ‌న్ చేయ‌లేని చాలా అభివృద్ధి ప‌నుల‌ను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు చేస్తున్నాడ‌ని, ఆ అభివృద్ధి ప‌నులు జ‌గ‌న్‌కు క‌నిపించ‌క అధికార పార్టీపై విమ‌ర్శ‌లు చేస్తున్నాడ‌ని, అయినా విమ‌ర్శ‌ల వ‌ల్ల ఓట్లు ప‌డ‌వ‌ని దేవినేని వెల్ల‌డించారు. `ముఖ్యమంత్రి ప‌ద‌వి నీకు అంద‌నిది.. ఆ వాసి నీకు లేదు. నువ్వో అవినీతి ప‌రుడివి, నీ మీద చీటింగ్ కేసులు ఉన్నాయి.` అని దేవినేని వ్యాఖ్యానించారు. సీఎం ప‌దవి మీద ఆశ‌తో అది ద‌క్క‌క పిచ్చి ప‌రాకాష్ట‌కి చేరుకొని జ‌గ‌న్ ఉన్మాదిలా మారాడ‌ని, ద‌య‌చేసి ఆయ‌న‌ ప‌క్క‌న ఉండేవాళ్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని దేవినేని హిత‌వు ప‌లికారు. `మీది అరాచ‌క‌త్వం... మాది అభివృద్ధి` అంటూ నంద్యాల ఎన్నిక‌ల్లో అరాచ‌క‌త్వానికి, అభివృద్ధికి మ‌ధ్య పోటీ జ‌రుగుతుంద‌ని, ఈ పోటీలో అభివృద్ధే గెలుస్తుంద‌ని దేవినేని అన్నారు.

  • Loading...

More Telugu News