: ఇంగ్లీషులో దంచుతాడు.. ఇళ్లకు కన్నం పెడతాడు.. పోలీసులకు చిక్కిన గజదొంగ!


కాల్ సెంటర్లో మంచి ఉద్యోగం... ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలడు... కానీ, బుద్ధి గడ్డి తిని అక్రమ మార్గం పట్టాడు. విలాసవంతమైన జీవితం కోసం చోరీల బాటను ఎంచుకున్నాడు. అతనే 27 ఏళ్ల వీరవంశీనాయుడు. చోరీల నేపథ్యంలో తరచుగా తమ ఇంటికి పోలీసులు వస్తుండటంతో... తమ పరువు తీస్తున్నావంటూ వంశీని కుటుంబసభ్యులు ఇంటి నుంచి వెలి వేశారు. అయినా, అతను పద్ధతి మార్చుకోలేదు. పైగా కరుడుగట్టిన దొంగగా మారాడు. గజ దొంగగా పోలీసు రికార్డులకెక్కాడు.

తమిళనాడు రాయవెల్లూరుకు చెందిన వంశీ కుటుంబం బతుకుదెరువు కోసం చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ కు తరలి వచ్చింది. సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో నివాసముంటోంది. డిగ్రీ పూర్తి చేసిన వంశీ కాల్ సెంటర్ లో ఉద్యోగం సంపాదించాడు. అయినా తన విలాసాలకు జీతం సరిపోకపోవడంతో దారి తప్పాడు. చోరీలకు అలవాటు పడిన అతన్ని కుటుంసభ్యులు ఇంటి నుంచి తరిమేశారు. అయినా పద్ధతి మార్చుకోని అతను... తిరుమలగిరి, మల్కాజిగిరి పీఎస్ ల పరిధిలో దొంగతనాలు చేస్తూ జైలుకెళ్లి వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నాచారం, కేపీహెచ్ బీ కాలనీ, జగద్గిరిగుట్ట, ఆల్వాల్, రామచంద్రాపురం, అమీన్ పూర్, నర్సాపూర్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఒక ముఠాను కూడా ఏర్పరుచుకున్నాడు.

బైక్ పై రెక్కీని నిర్వహించడం, తాళాలు వేసి ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లను గుర్తించడం, ఆ తర్వాత తాళాలు పగలగొట్టి చోరీ చేయడం చేసేవాడు. గత ఏడాదిన్నర కాలంలో ఏకంగా 19 దొంగతనాలు చేసి, 35 తులాల బంగారాన్ని చోరీ చేశారు. దొంగతనానికి వెళ్లినప్పుడు బంగారం దొరక్కపోతే ల్యాప్ టాప్ లు, కెమెరాలు, సెల్ ఫోన్లు, టూ వీలర్లు, టీవీలు ఎత్తుకుపోవడం వీరి స్టైల్. వీరికి సంబంధించిన పక్కా సమాచారంతో బాలానగర్, ఆల్వాల్ సీసీఎస్ పోలీసులు జగద్గిరిగుట్టలోని తిరుమల వైన్స్ వద్ద నిన్న వంశీతో పాటు సాయీశ్వర్, షబ్బీర్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 19.55 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు.  

  • Loading...

More Telugu News