: 14 మంది యువకుల ఉరిశిక్షను ఆపాలని సౌదీ రాజుకు నోబెల్ గ్రహీతల లేఖ
2012లో అల్లర్లు చెలరేగడానికి కారకులయ్యారన్న నేరంపై 14 మంది యువకులకు విధించిన ఉరిశిక్షను నిలిపివేయాలని పది మంది నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు సౌదీ అరేబియా రాజు సల్మాన్‌కు లేఖ రాశారు. నిరసనలు తెలిపినంత మాత్రాన మరణశిక్ష వేయడం సబబు కాదని వారు లేఖలో పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది మీద దాడి చేసి హింసా పద్ధతిలో నిరసన తెలిపినందుకు 14 మంది షియా ముస్లిం యువకులకు సౌదీ కోర్టు మరణశిక్ష విధించింది. వీరంతా ఫేస్బుక్, బ్లాక్‌బెర్రీ మెసెంజర్ల ద్వారా గ్రూపులు క్రియేట్ చేసుకుని, వాటిలో చర్చల ద్వారా నిరసనల వ్యూహాన్ని రచించుకున్నారు.
వీరు చేసిన దానిపై సరైన విచారణ జరపకుండానే ఉరిశిక్ష విధించారని, అందుకే దాన్ని నిలిపివేసి, తిరిగి విచారణ చేపట్టాలని నోబెల్ గ్రహీతలు కోరారు. నిజానికి సౌదీ ప్రభుత్వం వీరిని ఉగ్రవాదులుగా పరిగణిస్తోంది. అందుకే ఉరిశిక్ష వేసినందుకు తమను తాము సమర్థించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ లేఖ మీద నోబెల్ శాంతి బహుమతి పొందిన జోస్ రామోట్ హర్టా, డెస్మండ్ టుటూ, లెచ్ వాలేసా, డి క్లర్క్, లేమా, తవక్కల్ కర్మన్, శిరిన్ ఇబాదీ, జోడీ విలియమ్స్, మైరీడ్ మాగైర్లతో పాటు కైలాష్ సత్యార్థి కూడా సంతకాలు చేశారు.