: బృందావన్ ఆలయాల కీలక నిర్ణయం.. జన్మాష్టమి వేడుకల్లో చైనా వస్తువుల బహిష్కరణ!
డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ఆలయాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించనున్న వేడుకల్లో చైనాకు చెందిన ఒక్క వస్తువును కూడా ఉపయోగించకూడదని నిర్ణయించాయి. ఈ మేరకు చైనా వస్తువులను బాయ్‌కాట్ చేస్తున్నట్టు శ్రీకృష్ణ జన్మాష్టమి సేవా సదన్ పేర్కొంది. డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో ఆలయ పూజారులు, ఆఫీస్ బేరర్లు అందరూ చైనా వస్తువుల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చారు.
లైట్స్ నుంచి డెకరేషన్ వరకు అన్నింటినీ నిషేధించాలని పేర్కొన్నారు. ఈ నిరసనలో సాధువులు, పురోహితులు, మహంత్‌లు అందరూ పాలుపంచుకోవాలని శ్రీకృష్ణ జన్మాష్టమి సేవా సదన్ కార్యదర్శి కపిల్ శర్మ పేర్కొన్నారు. చైనా వస్తువులు ఉపయోగించకుండానే శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన వివరించారు. గత 50 రోజులుగా సిక్కిం సరిహద్దులో చైనా-భారత్ సైనికుల మధ్య స్టాండాఫ్ కొనసాగుతుండడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.