: అధికారం ఎల్లకాలం ఉండదు.. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి యాత్ర ప్రారంభం: కోదండరామ్
తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. ఈ రోజు తనను అరెస్టు చేసిన పోలీసులు తిరిగి విడిచిపెట్టిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.... అధికారం ఉన్నది కాంట్రాక్టులను చేజిక్కించుకునేందుకు కాదని, ప్రజల సమస్యలు తీర్చడానికని అన్నారు. అధికారం ఎల్లకాలం ఉండదని అన్నారు. ఇక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళతామని కోదండరామ్ వ్యాఖ్యానించారు. అంబేద్కర్, గాంధీ చూపిన శాంతి బాటలో ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ రోజు అమరవీరుల స్ఫూర్తి యాత్రను అడ్డుకుని అధికార పార్టీ తన బలహీనతను బయటపెట్టుకుందని విమర్శించారు.
రేపు ఉదయం 9 గంటల నుంచి హైదరాబాద్ నుంచి తమ యాత్ర ప్రారంభమవుతుందని కోదండరామ్ తెలిపారు. ఉద్యమ ద్రోహులు తమపై దాడులు చేస్తున్నారని తెలిపారు. న్యాయం తమవైపే ఉందని, తామే గెలుస్తామని అన్నారు. అధికార నాయకులు ఇసుక, భూ దందాలకు పాల్పడుతున్నారని అన్నారు. 'నిన్న కేసీఆర్ నన్ను అడ్డుకోమని చెప్పారు.. ఈ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను అడ్డుకున్నారు' అని ఆయన అన్నారు.