: కోదండరామ్ అరెస్ట్... పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
అమరవీరుల స్ఫూర్తి యాత్రలో పాల్గొంటున్న టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్‌తో పాటు పలువురు నాయకులను పోలీసులు కామారెడ్డి జిల్లా సరిహద్దు బస్వాపూర్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం అరెస్టు చేశారు. అయితే, కోదండరామ్‌ను తరలించిన బిక్కనూరు పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్‌స్టేషన్‌లో టీజేఏసీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. కోదండరామ్ అరెస్టును ఖండిస్తూ పలు ప్రాంతాల నుంచి టీజేఏసీ కార్యకర్తలు భారీగా ఆ పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చారు. అక్కడకు చేరుకున్న పలువురు కళాకారులు సీఎం కేసీఆర్‌కి వ్యతిరేకంగా పాటలు పాడారు.
తమ యాత్రను కొనసాగిస్తామని కోదండరామ్ పోలీసులను కోరగా, పోలీసులు అందుకు ఒప్పుకోలేదు. తాము యాత్ర చేసుకునేందుకు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం ఏంటని కోదండరామ్ మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నిస్తామనే పాలకులు యాత్రకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాత్ర కొనసాగిస్తామని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో కోదండరామ్‌ను బిక్కనూర్ నుంచి తరలించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.