: సెప్టెంబర్ 5న వినాయక నిమజ్జనం: మంత్రి నాయిని
సెప్టెంబర్ 5న వినాయక నిమజ్జనం నిర్వహించనున్నట్టు తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. నిమజ్జన సమయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిమజ్జనం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రానికి పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందు కోసం 160 క్రేన్స్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. 35 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గణేశ్ ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు, కేంద్ర బలగాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నగరంలోని ప్రతి వినాయక మండపంను జియో ట్యాగింగ్ చేస్తున్నామని, సీసీ కెమెరాలు అన్ని రూట్లలో ఏర్పాటు చేస్తామని, కమాండ్ కంట్రోల్ రూమ్ తో సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయని చెప్పారు. బక్రీద్, వినాయకచవితి పండగలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టామని చెప్పిన మహేందర్ రెడ్డి, ట్యాంక్ బండ్ పైనే పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని స్పష్టం చేశారు.