: విజయవాడలో డ్రై ఫ్రూట్స్ కల్తీ దందా బట్టబయలు!


విజయవాడలో డ్రై ఫ్రూట్స్ కల్తీ దందా వ్యవహారం బట్టబయలైంది. నాసిరకం జీడిపప్పు, బాదంపప్పు, ఖర్జూర వంటి పౌష్టికాహార పదార్థాలను కల్తీ చేస్తున్న అక్రమార్కుడిని అధికారులు పట్టుకున్నారు. పాడైపోయిన, గడువు ముగిసిపోయిన డ్రైప్రూట్స్ ను రీ సైక్లింగ్ చేసి ఖరీదైన ధరలకు విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఐదేళ్లుగా ఈ దందా నడుస్తోందని, కొన్నాళ్లుగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగామని చెప్పారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు, గాంధీనగర్ లోని భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ లో తనిఖీలు చేసి ఆశ్చర్యపోయారు.

 నాసిరకం బాదంపప్పు, జీడిపప్పు, ఖర్జూరాలతో ప్యాకెట్లను తయారు చేయగా, మరికొన్ని ప్యాకెట్లు విదేశాలకు పంపించే తరహాలో ప్యాక్ చేసి ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇంకొన్ని ప్యాకెట్లను ప్రముఖ కంపెనీలకు చెందిన కవర్లతో తయారు చేశారని, ట్రేడింగ్ కు సంబంధించిన అనుమతులు తప్పా, ఫుడ్ కంట్రోల్ కు సంబంధించిన అనుమతులు లేనట్టు అధికారులు గుర్తించారు. ప్రముఖ కంపెనీల లేబుళ్లను ఉపయోగించి ఈ ప్యాకెట్లను తయారు చేయడం చీటింగ్ కిందకు వస్తుందని అన్నారు. అక్రమార్కులను వదిలిపెట్టమని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సంబంధిత అధికారులు చెప్పారు. కాగా, మాచవరంలో నకిలీ నెయ్యి తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
 

  • Loading...

More Telugu News