: వందేళ్లయినా ఇంకా చెక్కు చెదరని ఫ్రూట్ కేక్.. అంటార్కిటికాలో కనుగొన్న పరిశోధకులు!
పూర్తిగా మంచుతో నిండి ఉండే అంటార్కిటికా ప్రాంతంలో 106 ఏళ్ల క్రితం నాటి ఫ్రూట్ కేక్ అక్కడి పరిశోధకులకు దొరికింది. అది ఏ మాత్రం చెక్కుచెదరకుండా, ఇంకా తినడానికి యోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు. న్యూజిలాండ్‌కు చెందిన అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ పరిశోధకులు తూర్పు అంటార్కిటికా ప్రాంతంలో ఒక ఇగ్లూను గుర్తించారు. ఇందులో వారికి ఒక ఆహార ప్యాకెట్ దొరికింది. ఆ ప్యాకెట్ లో ఈ ఫ్రూట్‌కేక్ ఉన్నట్లు వారు తెలియజేశారు.
1822 నుంచి బేకరీ వ్యాపారం చేస్తున్న హంట్లీ అండ్ పామర్స్ కంపెనీ ఈ కేక్‌ను తయారుచేసినట్లు ఆ ప్యాకెట్ మీద ఉందని వారు చెప్పారు. ఈ కేక్ 1910- 1913 ప్రాంతంలో బ్రిటిష్ సాహసికుడు రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ అంటార్కిటికా సాహస యాత్రను చేబట్టినప్పటిదని తెలిపారు. కేక్ ప్యాకెట్ కొద్దిగా దెబ్బతిన్నా అంటార్కిటికాలోని వాతావరణ పరిస్థితుల కారణంగా కేక్ మాత్రం ఇంకా తినడానికి యోగ్యంగానే ఉన్నట్లు శాస్త్రవేత్త రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ వివరించారు. అంటార్కిటికా ప్రాంతాన్ని సందర్శించినపుడు ఎక్కువ శక్తి కావాల్సి ఉంటుంది. అందుకు ఫ్రూట్‌కేక్ కంటే చక్కని ఆహార పదార్థం మరొకటి లేదని ఆయన అన్నారు.