: ఆర్టికల్ 35-ఏ, ఆర్టికల్ 370లపై మోదీ హామీ ఇచ్చారు: జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా
భారత ప్రధాని నరేంద్ర మోదీతో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేడు సమావేశమయ్యారు. భేటీ అనంతరం మీడియాతో ఆమె మాట్లడుతూ, ఆర్టికల్ 35-ఏ, ఆర్టికల్ 370లను గౌరవిస్తామని మోదీ తనకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆర్టికల్ 370పై యథాతథ స్థితిని కొనసాగించాలని, దీనికి వ్యతిరేకంగా వెళ్లరాదని రెండు పార్టీల పొత్తులో భాగంగా తాము విధించుకున్న నిబంధన అని చెప్పారు.
ఆర్టికల్ 35-ఏకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను ప్రస్తుతం సుప్రీంకోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది. ఈ ఆర్టికల్ ను వెంటనే రద్దుచేయాలంటూ 'వీ ది సిటిజెన్స్' అనే స్వచ్ఛంద సంస్థ 2014లో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసింది. ఈ ఆర్టికల్ వల్ల కశ్మీర్ లో స్థానికేతరులకు అన్యాయం జరుగుతుందని... ప్రభుత్వ ఉద్యోగాలను పొందలేరని, ఆస్తులను కొనుగోలు చేయలేరని పిటిషన్ లో పేర్కొంది. కశ్మీరీల అధికారాలను, ప్రత్యేక హక్కులను ఈ ఆర్టికల్ సంరక్షిస్తుంది.
ఈ నేపథ్యంలో గత నెలలో మెహబూబా మాట్లాడుతూ, జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాకు భంగం వాటిల్లితే ఇక్కడున్నవారెవరూ జాతీయ పతాకాన్ని తమ భుజాన మోయరని హెచ్చరించారు. మరోవైపు, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏలను రద్దు చేయడానికి ఇదే సరైన సమయమని జమ్ముకశ్మీర్ బీజేపీ శ్రేణులు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ప్రధానితో మెహబూబా భేటీ అయ్యారు.