: కాంగ్రెస్ మెడకు మళ్లీ చుట్టుకుంటున్న బోఫోర్స్!
భారత రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కేంద్రబిందువైన బోఫోర్స్ కుంభకోణం కేసును మళ్లీ విచారించనున్నారు. ఈ కేసును పునర్విచారించనున్నట్టు పార్లమెంటరీ కమిటీకి సీబీఐ ఈరోజు సంకేతాలు పంపింది. ఈ కేసును మళ్లీ విచారించాలని, సుప్రీంకోర్టు ముందు నివేదించాలని పార్లమెంటరీ కమిటీకి చెందిన పలువురు సభ్యులు కోరడంతో, సీబీఐ ఈ మేరకు స్పందించింది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ కు కూడా మద్దతిస్తామని తెలిపింది.
కేసు వివరాల్లోకి వెళ్తే, భారత సైన్యం కోసం 400 అత్యాధునిక గన్స్ కోసం 1986 మార్చి 24న భారత ప్రభుత్వం-స్వీడిష్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ ల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ రూ. 1437 కోట్లు. అయితే, ఈ ఒప్పందం నేపథ్యంలో భారత్ లోని ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణ అధికారులకు బోఫోర్స్ సంస్థ భారీగా ముడుపులు చెల్లించిందంటూ 1987 ఏప్రిల్ 16న స్వీడిష్ రేడియో ప్రకటించింది.
దీంతో, భారత రాజకీయ రంగంలో పెను దుమారం రేగింది. ఈ కేసులో నిందితులైన విన్ చద్దా, ఖత్రోచి, భట్నాగర్, మార్టిన్ లు ఇప్పటికే మరణించారు. 2005లో హిందుజా సోదరులు శ్రీచంద్, ప్రకాష్ చంద్, గోపీచంద్ లపై ఉన్న అభియోగాలను ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్ఎస్ సోధీ కొట్టివేశారు. 2004లో ఢిల్లీ హైకోర్టు మరో జడ్జి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో, ఈ కేసును పునర్విచారించాలనే నిర్ణయం రాజకీయ ప్రకంపనలను పుట్టించబోతోంది.