: అవును, నేను నల్లగా ఉంటాను...తెల్లగా ఉన్నవాళ్లంతా అందమైన వాళ్లా?: టీమిండియా క్రికెటర్ అభినవ్ ముకుంద్ సూటి ప్రశ్న
వర్ణ వివక్షపై టీమిండియా టెస్టు ఓపెనర్ అభినవ్ ముకుంద్ తీవ్రంగా స్పదించాడు. తెల్లగా ఉన్నవాళ్లంతా అందమైన వాళ్లా? నల్లగా ఉన్నవారిలో అందమైన వారు లేరా? అంటూ ప్రశ్నించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బహిరంగ లేఖ రాసిన అభినవ్ ముకుంద్.. 'పదో ఏట నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. క్రికెట్ నీడలో ఆడుతారో.. లేక ఎండలో ఆడుతారో అందరికీ తెలిసిందే. ఆటలో భాగంగా నేను వివిధ ప్రాంతాలు తిరగాల్సి వస్తుంది. అక్కడి వాతావరణానికి తట్టుకుని నిలబడాల్సి వస్తుంది.
అంతే కాకుండా నేను వేడి అధికంగా ఉండే చెన్నై నుంచి వచ్చాను. ఈ కారణాల వల్ల నా శరీరంలో రంగులు మారాయి. అయితే రంగుమారడంలో వచ్చిన ఇబ్బంది ఏంటి? నాకు ఇష్టమైన పని చేసేందుకు, జీవితంలో నేను ఏర్పర్చుకున్న లక్ష్యాలు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాను. ఈ దశలో నా రంగుతో వచ్చిన ఇబ్బంది ఏంటి?' అంటూ నిలదీశాడు. ఈ లేఖ కేవలం తనకోసం రాయడం లేదని, తనలాంటి చాలా మందిని ఉద్దేశించి రాస్తున్నానని అభినవ్ ముకుంద్ తెలిపాడు. ఈ లేఖ విశేషమైన ఆదరణ పొందుతోంది. దీనికి వ్యాఖ్యలు, రీట్వీట్లతో ఆదరణ లభిస్తోంది.