: శిల్పా చక్రపాణి రాజీనామా పెండింగ్ లో... నంద్యాల ఫలితం తరువాతే నిర్ణయం!
తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉండి, వైకాపాలో చేరిన శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాను మండలి ఆమోదిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. శిల్పా చక్రపాణి రెడ్డి తమ్ముడు శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక బరిలో వైకాపా తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చక్రపాణి కూడా వైకాపాలో చేరుతున్నట్టు ప్రకటించి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి లేఖను పంపారు.
దీనిపై మండలికి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకోవాల్సి వుండగా, నంద్యాల ఉప ఎన్నిక తరువాతే నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఇక చక్రపాణిని ఆయన పిలిపించి మాట్లాడతారా? లేక కనీసం ఫోన్ చేసైనా రాజీనామా చేసిన విషయాన్ని నిర్ధారించుకుంటారా? అన్న విషయమై చర్చ జరుగుతోంది. కాగా, పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన తరువాత ఎదురు చూడవలసిన అవసరం లేదని రాజీనామాను ఆమోదించేయాలని కోందరు టీడీపీ నేతలు అంటుండగా, అలా చేస్తే, వైకాపా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయమై విమర్శలు వెల్లువెత్తుతాయని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో నెలాఖరు తరువాత స్పష్టత వస్తుందని అంచనా.