: యద్ధానికి సన్నద్ధం వార్తలను ఖండించిన భారత్.. గ్రామాలను ఖాళీ చేయించలేదన్న ఆర్మీ!
డోక్లాం స్టాండాఫ్ విషయంలో భారత్-చైనా మధ్య దాదాపు రెండు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధానికి భారత్ సిద్ధమవుతోందన్న వార్తలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. సిక్కిం-భూటాన్-టిబెట్ త్రికూడలి సమీపంలోని గ్రామాలైన కుప్పుప్, నాథంగ్, జులుక్ తదితర వాటిని ఖాళీ చేయిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆర్మీ తోసిపుచ్చింది. అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పింది. ఇటువంటి ఉద్రిక్తతలు పెంచే వార్తలను ప్రచారం చేయవద్దని సూచించింది. అయితే చైనా కనుక ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు దిగినా భారత్ మాత్రం తగిన రీతిలో బదులిస్తుందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 4,057 కిలోమీటర్ల మేర ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ మాత్రం అప్రమత్తంగా ఉంది.