: జగన్ తిట్ల వెనక పీకే.. ఏదో రకంగా జనాల్లో ఉండాలన్నదే వ్యూహం!
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదేపదే ఎందుకు తిట్ల దండకం అందుకుంటున్నారు? వ్యక్తిగత విమర్శలకు ఎందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు? సీఎంను కాల్చండి.. చంపండి.. ఉరితీయండి.. అనడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి? అసలు జగన్ ఇలాంటి వ్యూహాన్ని ఎందుకు ఎంచుకున్నారు.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం పీకే... అదే ప్రశాంత్ కిశోర్!
అటు టీడీపీ, ఇటు వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక పోరులో గెలవాలంటే నిత్యం ప్రజల నోళ్లలో నానాలన్నదే జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) లక్ష్యంగా కనిపిస్తోంది. జగన్ గురించి ప్రజలు ఎంతగా మాట్లాడుకుంటే విజయావకాశాలు అంతగా ఉంటాయన్నది ఆయన ఉద్దేశం. అది ప్రశంసా, విమర్శా.. అన్నది పక్కన పెడితే ప్రజలు ఏదో రకంగా జగన్ గురించి మాట్లాడుకోవాలి. నిత్యం వార్తల్లో ఉండాలి. అప్పుడే విజయం సునాయాసమవుతుందని పీకే వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దీనికి ఉదాహరణగా జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్, తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి రోజైనా గడవకముందే చంద్రబాబును ఉరితీయాలంటూ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి జగన్ నంద్యాల ఉప ఎన్నికలో పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు చెబుతున్నారు.
జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తారు. దానికి ప్రతిగా వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగుతాయి.. ఇలా ఎటు చూసినా జగన్ నామస్మరణతో వాతావరణం వేడెక్కుతుంది. ఏమూల చూసినా అదే చర్చ జరుగుతుందన్నది పీకే వ్యూహంలో ఓ భాగమని అంటున్నారు. చర్చ ఇటువైపు మళ్లడం వల్ల నంద్యాలలో ఎవరేం చేశారు? అధికారంలో వస్తే ఏం చేయబోతారు? అన్న ప్రశ్నలు తలెత్తవు. కాబట్టి జగన్ ఈ వ్యూహంతోనే ముందుకెళ్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.