: జేడీయూ నుంచి సీఎం నితీశ్ కుమార్‌ను బహిష్కరిస్తాం: శరద్ యాదవ్ వర్గం
ఆర్జేడీ నుంచి తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు ఈ విషయంపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో జేడీయూ పార్టీలోని అసమ్మతి వర్గం నితీశ్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని యోచిస్తోంది.
ఈ విషయమై ఆ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ అరుణ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ... మహాఘట్ బంధన్(కూటమి) నుంచి జేడీయూ తప్పుకోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును అవమానించడమే అవుతుందని అన్నారు. అందుకే నితీశ్ కుమార్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తామని అన్నారు. ఈ విషయంపై తాము న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ నెల 19న నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ సర్వసభ్య సమావేశం జరగనుంది. అదే సమయంలో మరోవైపు శరద్ యాదవ్ అసమ్మతి నేతలతో భేటీ కావడమే కాకుండా, ఆ రాష్ట్ర పర్యటన చేయనున్నారు.