: ఇండియాలో అత్యాచారం చేశాడు... ఆస్ట్రేలియాకు పారిపోతే అక్కడికీ వచ్చాడు: హైదరాబాదీపై ఎన్నారై యువతి ఫిర్యాదు


ఓ ఎన్నారై మహిళ తన పాత బాస్ పై సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. తనకు బాస్ గా ఉన్న హైదరాబాద్ కు చెందిన ఉన్నతోద్యోగి, ఢిల్లీలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆపై తాను భర్త, పిల్లలతో సహా ఆస్ట్రేలియా వెళితే, అక్కడికి కూడా వచ్చి వేధించడం మొదలు పెట్టాడని 38 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే...

సదరు యువతి నిందితుడిని తొలిసారిగా న్యూఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ లో కలిసింది. ఇద్దరూ ఒకే విభాగంలో పని చేస్తుండటంతో తరచూ మాట్లాడుకుంటూ సంప్రదింపులు జరుపుతూ ఉండేవారు. అతని ప్రాజెక్టుల్లో తనను కలుపుకుంటూ, అందరిముందే ఆమె పనితీరును పొగడుతూ ఉండేవాడు. తనతో సంభాషణలో భాగంగా, తన భార్య స్వార్థం, దుర్మార్గంతో లేచిపోయిందని, కుమార్తెను సొంతంగా పెంచుకుంటున్నానని తన బాధను చెబుతూ తరచూ ఫోన్ చేస్తుండేవాడు.

ఈ క్రమంలో 2013 మార్చిలో బాధితురాలు ఒంటరిగా ఉన్న వేళ, ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు. అతనికో కూల్ డ్రింక్ ఆఫర్ చేసి, తనూ ఓ డ్రింక్ తాగింది. ఆ తరువాత ఆమె స్పృహ కోల్పోగా, లేచి చూసేసరికి బెడ్ రూములో నగ్నంగా పడివుంది. పక్కనే కూర్చున్న అతను, జరిగింది మరచిపోవాలని బెదిరిస్తూ, తాను అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియో తీశానని చెప్పి, వాటిని చూపి బెదిరింపులకు దిగాడు. ఆపై పలుమార్లు పెద్ద నగరాల్లోని హోటళ్లకు తీసుకెళ్లి పదేపదే అత్యాచారాలు చేశాడు. అతని బెదిరింపులకు తాళలేక లక్షల కొద్దీ డబ్బులను ఆమె ఇచ్చింది. బాధను ఎవరికీ చెప్పుకోలేక, ఆస్ట్రేలియాకు వెళ్లిపోతే, అక్కడికీ వచ్చి వేధింపులు మొదలు పెట్టాడు. తన భర్తకు ఈ-మెయిల్స్ పంపుతూ తనను వేధిస్తూ, వెంటాడుతున్నాడని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News