: `డోక్లాం' విషయంలో చైనా వ్యాఖ్యలను ఖండించిన భూటాన్!
భారత్, భూటాన్, చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లాం సరిహద్దు తమ ప్రాంతం కాదని, ద్వైపాక్షిక చర్చల్లో భూటాన్ స్పష్టం చేసిందంటూ చైనా విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలను భూటాన్ ప్రభుత్వం ఖండించింది. `డోక్లాం వివాదంలో మా స్థానం ఏంటో మాకు కచ్చితంగా తెలుసు. దీని గురించి స్పష్టత కావాలంటే జూన్ 29, 2017న భూటాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ప్రచురించిన వ్యాసం చూడండి` అని భూటాన్ ప్రభుత్వం తెలిపింది.
డోక్లాం తమ భూభాగం కాదని భూటాన్ అధికారికంగా స్పష్టం చేసినట్లు భారత మీడియాకు చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి వాంగ్ వెన్లీ ఎలాంటి ఆధారాలు చూపించలేదు. అంతేకాకుండా డోక్లాం భూభాగం భారత్‌ది కూడా కాదని, అక్కడ భారత సైన్యం ఉండటం ఏంటని భూటాన్ ఆశ్చర్యపడినట్లు ఆమె చెప్పారు. ఈ విషయాలను భూటాన్ ఖండించింది. తాము జూన్ 29న చెప్పినట్లుగానే డోక్లాం ప్రాంతంలో ఎలాంటి రోడ్డు మార్గాన్ని చైనా నిర్మించకూడదని మళ్లీ చెబుతున్నట్లు భూటాన్ అధికార వర్గం పేర్కొంది. నిజానికి భూటాన్‌కు, చైనాకు మధ్య ప్రత్యక్ష ద్వైపాక్షిక సంబంధాలు లేవు. ఆ దేశాల మధ్య ఏ చర్చ జరిగినా అందులో భారత్ భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పటివరకు డోక్లాం విషయంలో భూటాన్, చైనాల మధ్య 24 సార్లు చర్చలు జరిగాయి. భారత్, చైనాల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయి.