: వైఎస్ లో ఉన్నదీ, చంద్రబాబులో లేనిదీ ఇదేనంటున్న ఏపీ మంత్రులు!
తమ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురించి మంత్రులు ఆఫ్ ది రికార్డ్ కీలక విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ, వైఎస్ లో ఉన్నదీ, బాబులో లేని గుణాలను ఏకరవు పెడుతున్నారు. అసలింతకీ విషయం ఏంటంటే...
రాజధాని హైదరాబాద్ లో ఉన్న సమయంలో సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ ఎక్కువ సమయం అక్కడే ఉన్నారు కాబట్టి, వారిని నిత్యమూ చూసే అవకాశం, కలిసే అవకాశం ఓ స్థాయి నేతలకు తక్కువగా ఉండేది. ఇప్పుడలా కాదు. ఏపీలో రాజకీయాలను ప్రభావితం చేయగల గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే నిత్యమూ అందరూ కనిపిస్తున్నారు. ఇక ఏ చిన్నదానికైనా స్పందించే గుణమున్న ఈ రెండు జిల్లాల ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశంలో గతంలో పదవులు అనుభవించిన వారి నుంచి, ఇప్పటి మంత్రుల వరకూ ఎవరు కలిసి మాటలు మొదలు పెట్టినా, అది చంద్రబాబును దూషించేంత వరకూ వెళుతుందనేది ప్రభుత్వం స్వయంగా నియమించుకున్న ఓ పరిశీలకుడి అభిప్రాయంగా తెలుస్తోంది.
ఇటీవల సచివాలయంలో ఐదుగురు మంత్రుల మధ్య జరిగిన సంభాషణపై విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చంద్రబాబుపై పలువురి ఆగ్రహానికి కారణాలివి. పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదని, కలిసినప్పుడు భుజం తట్టి, పలకరించి, యోగక్షేమాలు అడిగినా నేతలకు ఆనందం కులుగుతుందని, చంద్రబాబు ఆ మాత్రం చేయడంలో విఫలమవుతున్నారని వారు చర్చించుకున్నారు. గత వారంలో సీఎంను కలిసేందుకు దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్లగా, ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నారని సమాధానం వచ్చింది. రెండు గంటల పాటు ఎదురుచూపుల తరువాత, వారిలో అసహనం బయలుదేరిన వేళ, సీఎం చాంబర్ నుంచి ఒకే ఒక్క అధికారి బయటకు వచ్చారట. ఆపై వీరందరికీ సీఎం దర్శనం లభించగా, ఒక్కొక్కరికీ ఒక్క నిమిషం మాత్రమే సమయమిచ్చిన చంద్రబాబు, వారు చెప్పాలనుకున్నది కూడా పూర్తిగా వినలేదని, కాసేపు కూర్చోబెట్టి మాట్లాడితే సంతృప్తిగా ఉండేదని వారు వాపోయినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, అధికార పక్షం నేతలైనా, ప్రతిపక్షం నేతలైనా దగ్గరకు వెళితే, భుజంపై చెయ్యి వేసి, నవ్వుతూ మాట్లాడి, సమస్య తెలుసుకుని పంపేవారని, చంద్రబాబులో ఆ లోపం కనిపిస్తోందని ఓ మంత్రి స్వయంగా వ్యాఖ్యానించడం గమనార్హం. జనంలోకి వెళ్లాల్సిన ఎమ్మెల్యేలతో బాబు వైఖరి ఎంతమాత్రం సమంజసంగా లేదని, ఒక్కొక్కరూ తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారట. ఇటీవల ఓ నియోజకవర్గ ఇన్ చార్జ్, మూడు నెలలుగా సీఎంతో మాట్లాడాలని ప్రయత్నించినా కుదరక, పార్టీకే రాజీనామా చేసిన విషయాన్నీ వారు ప్రస్తావించుకున్నట్టు తెలుస్తోంది. కాసేపు కూర్చోబెట్టి మాట్లాడితే, ఆ నేత పార్టీని వీడివుండే వారు కాదని మంత్రులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఇక మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితే అలావుంటే, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలకు కనీసం సీఎం కంటికి కూడా కనిపించడం లేదని తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధినేతలో మార్పు రావాలని కోరుకోవడం మినహా తామేమీ చేయలేని పరిస్థితని వారు వాపోతున్నారు.