: నార్త్ కొరియాపై బాంబు దాడి చేయాలంటూ దేవుడి నుంచి అనుమతి వచ్చేసిందట!
ఉత్తర కొరియా వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడికి ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించింది. యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు, వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, శాంతి, సహనాలను ప్రబోధిస్తూ, చర్చలను మాత్రమే ప్రోత్సహించే ఎవాంజలికవ్ వర్గం ఆయనకు సపోర్టునిచ్చింది. ఎవాంజలికల్ సలహాదారు రోబెర్ట్ జెఫెర్స్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, బైబిల్ లోని రోమన్స్ చాప్టర్ లో స్పష్టంగా పేర్కొన్న విధంగా దేశ రక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం ఉత్తర కొరియాపై బాంబు దాడులు చేసేందుకు దేవుడి నుంచి అనుమతి లభించిందని అన్నారు. దుష్ట శక్తులను అంతం చేయడానికి అధినేతకు అనుమతి లభించిందని టెక్సాస్ లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో వేలాది మందిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం అమెరికాలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక తనకు ఇలాగే మద్దతు పెరిగితే ట్రంప్, ఏ క్షణమైనా నార్త్ కొరియాపై దాడికి దిగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.