: రేమండ్ రారాజుకూ తప్పని 'సన్' స్ట్రోక్.. ఆస్తి లాక్కుని తండ్రిని ఇబ్బంది పెడుతున్న గౌతమ్ సింఘానియా!
కన్నకొడుకు తిండి, వసతులు కల్పించడం లేదని కేవలం మధ్య తరగతి వాళ్లే కోర్టు మెట్లు ఎక్కుతారనుకుంటే పొరపాటే.. రేమండ్ బ్రాండ్ పేరుతో పురుషుల వస్త్రాలు తయారు చేసి, ఒక వెలుగువెలిగిన రేమండ్ రారాజు విజయ్‌పథ్ సింఘానియాకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. తాను సంపాదించిన ఆస్తి లాక్కుని ఇప్పుడు కనీస వసతులు కూడా కల్పించడం లేదని కుమారుడు గౌతమ్ సింఘానియాపై విజయ్‌పథ్ కేసు వేశారు. లీగల్‌గా తనకు రావాల్సిన ఆస్తులను కూడా అప్పగించడం లేదని ఆయన కోర్టుకెక్కాడు.
ముంబైలోని మలబార్ హిల్స్‌లో ఉన్న 36 అంతస్తుల జేకే కాంప్లెక్స్‌లో విజయ్పథ్కి ఒక డూప్లెక్స్ ఇల్లు రావాల్సి ఉంది. అలాగే ఆ కాంప్లెక్స్‌లో విజయ్‌పథ్ మరో కుమారుడు అజయ్‌పథ్ సింఘానియా కుటుంబానికి కూడా నాలుగు డూప్లెక్స్ ఇళ్లు రావాల్సి ఉంది. ఇవేవీ గౌతమ్ సింఘానియా ఇవ్వడంలేదు. దీంతో వీళ్లంతా కోర్టును ఆశ్రయించారు. నిజానికి ఈ జేకే కాంప్లెక్స్‌ను విజయ్‌పథ్ తన సొంత స్థలంలో 1960లో 14 అంతస్తులుగా నిర్మించారు. తర్వాత దాని స్థానంలోనే 36 అంతస్తుల కాంప్లెక్స్‌ను రేమండ్ సంస్థ వారు నిర్మించారు.
తర్వాత ఆ సంస్థలోని రూ. 1000 కోట్ల విలువైన షేర్లు గౌతమ్ సింఘానియా పరం చేయడంతో విజయ్‌పథ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఆయన ఓ అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కంపెనీ నిబంధనల ప్రకారం విజయ్ సింఘానియాకు నెలకు రూ. 7 లక్షలతో పాటు, కనీస వసతి కల్పించాలి. అవి కూడా గౌతమ్ కల్పించడం లేదని విజయ్‌పథ్ తరఫు న్యాయవాది ఆరోపిస్తున్నారు. దీనిపై రేమండ్స్ వారి సమాధానాన్ని 18లోగా తెలియజేయాల్సి ఉంది. 22న ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది.