: మందు కొట్టి దొరికిపోయిన 'కాళేశ్వరి' డ్రైవర్... రాత్రంతా ప్రయాణికులకు నరకం!
మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కొందరు మారడం లేదు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు కొందరు డ్రైవర్లు. గత రాత్రి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన 'కాళేశ్వరి' ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం తాగి వాహనం నడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. కృష్ణా జిల్లా గరికపాడు వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ, ఈ డ్రైవర్ పై అనుమానంతో బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా, మోతాదుకు మించి మద్యం తాగినట్టు గమనించి, బస్సును నిలిపివేశారు. డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు.
బస్సులో 49 మంది ప్రయాణికులు ఉండగా, ఆ దారిలో విశాఖకు వెళ్లేందుకు వస్తున్న బస్సులను ఆపి, సీట్ల ఖాళీలను బట్టి వేర్వేరు బస్సుల్లో తరలించారు. ఈ ఘటనతో తాము రాత్రంతా నరకాన్ని అనుభవించామని ప్రయాణికులు వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్న ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.