: నన్ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో.. నా తర్వాతి లక్ష్యం గుజరాతే: అహ్మద్ పటేల్
తాను రాజ్యసభకు ఎన్నిక కాకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారని, అయితే చివరికి సత్యమే గెలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పేర్కొన్నారు. రాజ్యసభకు ఐదోసారి ఎన్నిక కావడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన తనను గెలిపించిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ‘సత్యమేవ జయతే’ అని పోస్ట్ చేశారు.
తనను ఓడించేందుకు డబ్బును విచ్చలవిడిగా వెదజల్లారని, అధికార బలాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. అయినా తన గెలుపును ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇది తాను సాధించిన విజయం కాదని, రాష్ట్రంలో విచ్చలవిడి డబ్బు పంపకం, అధికారం ఓటమి పాలయ్యాయని అభివర్ణించారు. ఇక తన భవిష్యత్ లక్ష్యం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలేనని మనసులో మాటను అహ్మద్ పటేల్ బయటపెట్టారు. కాగా, రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో నాటకీయ పరిణామాల మధ్య అహ్మద్ పటేల్ విజయం సాధించారు.