: 650 డిగ్రీల ఉష్ణోగ్రతలో సైతం కరగని ఐస్ క్రీంను తయారు చేసిన శాస్త్రవేత్తలు!
ఐస్ క్రీంను ఇష్టపడనివారు ఎవరుంటారు? చిన్నాపెద్దా అందరూ ఇష్టంగా తింటారన్న సంగతి తెలిసిందే. అయితే ఐస్ క్రీంను పార్లల్ లోంచి బయటకు తేగానే, సాధారణ ఉషోగ్రత వద్ద సైతం కరగడం మొదలవుతుంది. దీంతో హడావిడిగా తినేయడం మొదలెడతాం. ఇకపై అలాంటి ఇబ్బంది లేకుండా జపాన్ కు చెందిన కనాజవా విశ్వవిద్యాలయ పరిశోధకులు కరిగిపోని ఐస్ క్రీంను తయారు చేశారు.
వీరు తయారు చేసిన ఈ ఐస్ క్రీం 650 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా కరిగిపోకుండా ఉంటుందని తెలిపారు. దీనిని హెయిర్ డ్రయ్యర్ తో కూడా కరిగించి చూశారట. ఇలా కరగకుండా ఉండడానికి స్ట్రాబెర్రీల నుంచి తీసిన పాలీఫెనాల్ ద్రావణాన్ని దీని తయారీలో వినియోగించినట్టు వారు తెలిపారు. ఈ ద్రావణం నీటిని, నూనెను అంత సులభంగా విడగొట్టదని, ఈ సూత్రం ఆధారంగానే తాము తయారు చేసిన ఐస్ క్రీం కూడా కరిగిపోదని వారు తెలిపారు. ఈ కరగని ఐస్ క్రీంలను చాకొలేట్, వెనీలా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లలో అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు.