: సత్యాన్ని చెప్పడానికి వెనుకాడలేదు... పాదాభివందనాలు చేయలేదు: వెంకయ్యనాయుడు
సత్యాన్ని చెప్పేందుకు ఏనాడూ తాను సంశయించలేదని, ఆ విషయంలో తనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అందుకే వివాదాలతో తాను సావాసం చెయ్యలేదని ఆయన చెప్పారు. రాజకీయాల్లో వారసత్వాన్ని తానేనాడూ ప్రోత్సహించలేదని అన్నారు. అలా చేస్తే క్యారెక్టర్, క్యాలిబర్ ఉన్న నేతలు రాజకీయాల్లోకి రారని ఆయన అన్నారు. అందుకు తన భార్య ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. అందుకే మీడియాతో మాట్లాడుతూ, ఉషాపతిగా ఉండడమే తనకు ఇష్టమని చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఉషాపతిని, ఉపరాష్ట్రపతిని, సభాపతిని కూడా తానేనని ఆయన చమత్కరించారు.
అలాగే తన స్నేహితులు కూడా సిఫారసులతో ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని ఆయన చెప్పారు. రాజకీయాల్లో తానేనాడు పైసా సంపాదించలేదని ఆయన చెప్పారు. అలాగే తానేనాడూ ఎవరికీ పాదాభివందనం కూడా చేయలేదని ఆయన చెప్పారు. ప్రజలు ఇంట్లో కూర్చునే ప్రభుత్వాన్ని కదిలించాలని ఆయన సూచించారు. ఎన్నికల సంస్కరణలు అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాజీవితంలో సమస్యలు వస్తాయని, వాటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఆయా వ్యక్తులపై ఉంటుందని ఆయన చెప్పారు.