: డ్రగ్స్ కేసులో ఆరు రోజుల పాటు విచారణ అద్భుతంగా సాగింది!: కొరటాల శివ
తన ప్రతి సినిమాలోనూ సమాజానికి లేదా ప్రజలకు అవసరమయ్యే ఏదో ఒక అంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తానని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెలిపారు. సమాజంలో సమస్యలపై ప్రజలను మేల్కొల్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని శివ చెప్పారు. అందరూ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారని, మన కులం వాడు, మన మతం వాడు, మన ప్రాంతం వాడు, మనకి చెందిన వాడు తప్పు చేసినా వాడిని వెనకేసుకుని వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విధానం వల్లే వివిధ రంగాలు ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ విధానం మారాలంటే ముందు ప్రజలు మారాలని సూచించారు. తప్పు చేసినవాడు ఎవడైనా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఆరు రోజుల పాటు విచారణ అద్భుతంగా సాగిందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా చట్టాన్ని అనుసరించాల్సిందేనని ఆయన చెప్పారు. డ్రగ్స్ కేసులో దోషులకు శిక్ష పడుతుందని ఆయన చెప్పారు. ఆ విచారణ చూసిన తరువాత ప్రజల్లో కూడా మార్పు గమనించానని అన్నారు. అయితే అదే ఇంటెన్సిటీ చివరివరకు ఎందుకు కొనసాగలేదో తనకు అర్థం కాలేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి వేగం, అలాంటి చిత్తశుద్ధి, అలాంటి ప్రయత్నం ఉంటే దేశంలో సమస్యలు ఒక్కొక్కటిగా మాయమవుతాయని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.