: అమితాబ్ `కౌన్ బనేగా కరోడ్‌పతి 9` షూటింగ్ ప్రారంభం... ఆసక్తి కలిగిస్తున్న కొత్త హంగులు!
`కౌన్ బనేగా కరోడ్‌పతి 9` షూటింగ్ ప్రారంభమైనట్లు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్ తెలియజేశారు. సెట్లో షూటింగ్ జరుగుతున్న ఫొటోలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కొన్ని కొత్త హంగులతో ఈ సీజన్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక నియమాల్లో పెద్దగా మార్పు లేకున్నా సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వనున్నట్లు తెలుస్తోంది.
పార్టిసిపెంట్‌కు సహాయంగా ఆడియన్స్‌లో తమకు నమ్మకస్తుణ్ని అందుబాటులో ఉంచడం, ఫోన్ ఎ ఫ్రెండ్ ఆప్షన్లో వీడియో కాల్ సదుపాయంతో పాటు మరికొన్ని ఇతర మార్పులు చేయనున్నారు. ప్రశ్నల సంఖ్య కూడా పెంచి, అనవసర డ్రామాను తగ్గించే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది. సోనీ టీవీలో సెప్టెంబర్‌లో ప్రారంభమై ఆరు వారాల పాటు కేవలం 30 ఎపిసోడ్లుగా ఈ షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆధారంగానే తెలుగులో `మీలో ఎవరు కోటీశ్వరుడు` కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.