: `మూడు చింతలపల్లి` గ్రామానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు!
మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి, కేశవరం, లక్ష్మాపూర్ గ్రామ ప్రజలపై సీఎం కేసీఆర్ వరాలజల్లు కురిపించారు. మూడుచింతలపల్లిలో జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేశవరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేశవరం అభివృద్ధి కోసం రూ. 12 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మూడుచింతలపల్లికి ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేశారు. వారం రోజుల్లోగా సంబంధిత మంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తారని ఆయన తెలియజేశారు.
మేడ్చల్ పరిధిలో ఉన్న గ్రామాల్లోని 75 వేల ఎకరాలకు గోదావరి జలాలతో నీటి సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా మూడుచింతలపల్లి నుంచి యాదాద్రికి బస్సు సౌకర్యం, మూడుచింతలపల్లి నుంచి లక్ష్మాపూర్ వెళ్లే దారిలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం, గ్రామంలో సీసీ రోడ్లు, రూ. 75లక్షలతో మల్టిపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, దోభీఘాట్, శ్మశానవాటిక, మెటర్నిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే రేపు సాయంత్రంలోగా మూడు చింతలపల్లిలో ఐదు 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మూడు చింతలపల్లికి చెందిన వీరుడు వీరారెడ్డి కృషిని గుర్తుచేశారు.