: రూ. 27.44 కోట్లు చెల్లించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లకు షాక్.. సదావర్తి భూములను మళ్లీ వేలం వేయాలన్న హైకోర్టు!
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. వివాదాస్పదమైన సదావర్తి భూముల వేలం ప్రక్రియపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ భూములకు మరోసారి వేలం నిర్వహించాలని తీర్పును వెలువరించింది. ఈ బహింరంగ వేలంలో ఎమ్మెల్యే ఆళ్ల కూడా పాల్గొనవచ్చని సూచించింది.
చైన్నైలో ఉన్న సదావర్తి భూములకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వేలం నిర్వహించింది. ఈ వేలంలో సదరు భూములను రూ. 22.50 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వేలం ప్రక్రియను దారుణంగా నిర్వహించారని, ఈ భూములకు భారీ ధర వస్తుందంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో, తాము వేసిన వేలం కంటే మరో రూ. 5 కోట్లు ఎక్కువగా ఇచ్చినట్టైతే ఆ భూములను ఆళ్లకు అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించిన ఆళ్ల... హైకోర్టు సూచనల మేరకు ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ కు రూ. 27.44 కోట్లను చెల్లించారు.
ఈ క్రమంలో, సదావర్తి భూములను ఉద్దేశపూర్వకంగానే తక్కువ ధరకు వేలం వేశారని, మరోసారి బహిరంగ వేలం నిర్వహించాలని కోరుతూ 'ఆలిండియా బ్రాహ్మణ సంఘం' హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... మరోసారి బహిరంగ వేలాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లోగా జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.