: జీవితకాల నిషేధంపై హైకోర్టు తీర్పు తరువాత శ్రీశాంత్ మనసులోని మాట!
తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని కొట్టివేస్తూ, కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత, ఆనందాన్ని వ్యక్తం చేసిన క్రికెటర్ శ్రీశాంత్, తన మనసులోని మాటను వెల్లడించాడు. తిరిగి భారత క్రికెట్ జట్టులోకి రావాలన్నది తన కోరికని, టెస్టు మ్యాచ్ లు ఆడే సత్తా తనకు ఉందని అన్నాడు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీశాంత్, మరో మూడు నాలుగేళ్లపాటు ఆడే శక్తి తనకుందని చెప్పుకొచ్చాడు. తిరిగి జట్టులోకి వచ్చి ఆడాలన్న ఆశ ఎంతో ఉందని చెప్పాడు.
తన జీవితంలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, ఇప్పుడిక ఫిట్ నెస్ సాధించి, రంజీలు ఆడటం ద్వారా సత్తా చాటుతానని నమ్మకంగా చెప్పాడు. తన ఇంట్లోని ఇండోర్ నెట్ లో నిత్యమూ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నట్టు వెల్లడించాడు. కాగా, ప్రస్తుతం 34 సంవత్సరాల వయసులో ఉన్న శ్రీశాంత్, తిరిగి క్రికెట్ జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే, శ్రీశాంత్ బౌలర్ కాబట్టి రంజీల్లో ఆడేందుకు అవకాశాలు ఉండవచ్చని, దానికి కూడా బీసీసీఐ అనుమతి తప్పనిసరని గుర్తు చేస్తున్నారు.