: గ్యాంగ్ స్టర్ నయీమ్ మరణించి నేటికి ఏడాది... సాగుతున్న కేసు విచారణ!
గ్యాంగ్ స్టర్ నయీమ్ ను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టి నేటికి ఏడాది పూర్తి అయింది. నయీమ్ మృతి తరువాత జరిపిన దాడుల్లో పెద్దఎత్తున బంగారంతో పాటు, ఆయనతో అంటకాగిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల వివరాలు, నగదు, భూ దందాలకు సంబంధించిన పత్రాలు తాము స్వాధీనం చేసుకున్నామన్న ప్రకటన తప్ప, ఇంతవరకూ కేసు కోర్టుకు ఎక్కింది లేదు. ఈ గ్యాంగ్ స్టర్ తో కలసి ప్రజలను ఇబ్బందుల పాలు చేసిన వారి అరెస్టులూ లేవు. ఈ కేసు విచారణ ఏడాదిగా సాగుతూనే ఉంది.
కాగా, నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత 31 కేసులను నమోదు చేశామని, ఇప్పటివరకు 9 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేశామని, త్వరలోనే మిగతా 22 కేసుల్లో చార్జిషీట్ వేస్తామని ఈ కేసును ప్రత్యేకంగా విచారిస్తున్న ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ అధికారులు చెబుతున్నారు. ఏడాదిగా నయీమ్ దందాలపై 227 కేసులు నమోదయ్యాయని, మొత్తం 895 మంది సాక్షులను విచారించామని సిట్ ఓ ప్రకటనలో తెలిపింది. నయీమ్ తో అంటకాగిన వారిలో 128 మందిని అరెస్ట్ చేసి, ఆపై 109 మందిని కస్టడీలోకి తీసుకుని విచారించామని తెలిపింది. దర్యాఫ్తు తుది దశకు చేరిందని, ఐదుగురు పోలీసు అధికారులు సస్పెండ్ కు గురయ్యారని గుర్తు చేసింది. కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని, దీన్ని త్వరలోనే పూర్తిచేస్తామని సిట్ తెలిపింది.