: కోటు కెమెరాకు మాత్రమే... వైరల్ అవుతున్న వార్తా విశ్లేషకుడి వీడియో!
వార్తా ఛానళ్లలో న్యూస్ రీడర్‌తో ఇంట్లో నుంచి చర్చలు చేసే వార్తా విశ్లేషకులను మనం చూస్తూనే ఉంటాం. దేశంలో జరుగుతున్న వ్యవహారాలను వివరించాలని ఏ వార్తా ఛానల్ ఎప్పుడు వారిని సంప్రదిస్తుందో తెలియని పరిస్థితి! కొన్ని సార్లు ఇంట్లో సేదతీరుతుండగా సమస్యను విశ్లేషించమనే అవకాశం ఉంది. అప్పటికప్పుడు విశ్లేషణ అయితే చేయగలరు, కానీ ప్రేక్షకులకు విజువల్‌గా బాగా కనిపించాలంటే సూటు వేసుకోవాల్సిందే! ఈలోగా ప్రసారం ప్రారంభమైతే ప్యాంటు వేసుకోకుండా సూట్ మాత్రం వేసుకుని గట్టెక్కించవచ్చని జోర్డాన్‌కి చెందిన వార్తా విశ్లేషకుడు నిరూపించాడు.
మాజిద్ అస్ఫోర్ అనే ఈ వార్తా విశ్లేషకుడు జోర్డాన్‌లోని వివిధ ఛానళ్లకు వార్తా విశ్లేషణలు చేస్తుంటాడు. తాను ఇంట్లో షార్ట్ వేసుకుని కేవలం పైన ధరించిన కోటు మాత్రమే కనిపించేలా టీవీలో వార్తా విశ్లేషణ చేస్తున్న వీడియోను ఆయన కుమారుడు మానఫ్ ఇంటర్నెట్‌లో పెట్టాడు. చాలా నవ్వుతెప్పించేలా ఉన్న ఈ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. దీనిపై మాజిద్ స్పందిస్తూ - `బయట 30 డిగ్రీల ఎండ కాస్తోంది. అందుకే షార్ట్స్ వేసుకున్నా. కెమెరాలో కనిపించేది పైభాగమే కాబట్టి సూట్ వేసుకుని కవర్ చేశా. మరి ఇంకేం చేయమంటారు?` అని ప్రశ్నించాడు.