: తల్లిని చూద్దామని అమెరికా నుంచి వచ్చాడు.. తీరా తలుపు తీస్తే...!
తల్లిని చూడాలనే తపనతో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తికి ప్రపంచమే శూన్యంగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే, ఆశాసహానీ (63) అనే వృద్ధురాలికి రితురాజ్ అనే ఏకైక కుమారుడు ఉన్నాడు. అతను అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో జాబ్ చేస్తున్నాడు. ఆశా సహాని ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఉన్న లోఖంద్వాల కాంప్లెక్స్ లో ఒంటరిగా నివసిస్తోంది. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త మరణించాడు.
ఈ నేపథ్యంలో, తన తల్లిని చూసేందుకు రితురాజ్ అమెరికా నుంచి ముంబై వచ్చాడు. ఎంత సేపు బెల్ కొట్టినా తన తల్లి తలుపు తీయలేదు. దీంతో, డూప్లికేట్ తాళాలు తయారు చేసే వ్యక్తి సాయంతో ఆయన తలుపు తీయించి, ఇంట్లోకి వెళ్లారు. అంతే, ఒక్క సారిగా ఆయన షాక్ కు గురయ్యారు. కుళ్లిపోయిన శవం రూపంలో తన తల్లి కనిపించింది. ఒక్కసారిగా తన జీవితం శూన్యంగా మారినట్టు అనిపించింది. చుట్టుపక్కల వారు రితురాజ్ ను ఓదార్చారు. అనంతరం, ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. ప్రమాదవశాత్తు ఆమె మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.