: నేటి చంద్రగ్రహణంతో ఏ రాశి వారికి ఎంత ఫలమంటే..!
నేటి రాత్రి ఏర్పడనున్న చంద్ర గ్రహణంపై జ్యోతిష్య, వేద పండితులు ప్రజలకు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఈ గ్రహణంతో అత్యధికులకు మేలు కలుగుతుందని, ఇదే సమయంలో కొంతమందిపై చెడు ప్రభావాన్ని కూడా చూపుతుందని అంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి బాధితులు, గర్బిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. గ్రహణ మోక్షం అర్థరాత్రి తరువాత ఉంది కాబట్టి, విడుపు స్నానం చేసిన తరువాత కూడా రాత్రి ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదని సలహా ఇస్తున్నారు.
సాధ్యమైనంత వరకూ నేటి సాయంత్రం 5 గంటల్లోగా ఆహారం తీసుకుని, రేపు ఉదయం వరకూ మరేమీ తీసుకోకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. ఇక ఈ గ్రహణం శ్రవణా నక్షత్రంలో వస్తోంది కాబట్టి, జన్మ, నామ నక్షత్రాలు 'శ్రవణం' అయితే వారు చూడవద్దని సలహా ఇస్తున్నారు. ఇక రాశుల విషయానికి వస్తే, మిధున, తుల, మకర, కుంభ రాశుల వారికి గ్రహణం అధమ ఫలాన్ని ఇస్తుందని, వృషభ, కర్కాటక, కన్య, ధనూ రాశి వారికి మధ్యమ ఫలం దక్కుతుందని, మేష, సింహ, వృశ్చిక, మీన రాశుల వారికి శుభ ఫలాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు.