: టెక్కీలుగా అమ్మాయిలు పనికిరారు... గూగుల్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిన ఉద్యోగి!


గూగుల్ ఇంటర్నల్ ఫోరమ్ 'గిజ్మోడో'లో ఓ ఉద్యోగి పోస్టు చేసిన ఆర్టికల్ వైరల్ అయి, సంస్థకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టగా, నష్ట నివారణకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 'గూగుల్ ఐడియాలజికల్ ఎకౌ చాంబర్' పేరిట ఓ ఆర్టికల్ రాస్తూ, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ఉన్నత స్థాయి ఉద్యోగుల్లో మహిళలు, మైనారిటీల సంఖ్యను పెంచుతామని గూగుల్ యాజమాన్యం ప్రకటిస్తున్న వేళ, జన్యుపరంగా మహిళలు టెక్ ఉద్యోగాలకు పనికిరారని, వారిని విధుల్లోకి తీసుకుంటే నష్టపోవాల్సి వుంటుందని రాసుకొచ్చారు. తాను ఎంతో ముఖ్యమైన అంశాలను స్పృశిస్తున్నానని, తనకు ఇతర కంపెనీల ఉద్యోగుల నుంచి మద్దతు కూడా ఉందని తెలిపారు.
 
ఈ ఆర్టికల్ ను రాసిన ఉద్యోగి పేరు బహిర్గతం కాలేదు కానీ, అతని వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలు ఓ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలో పనితీరు వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని, ఈ తరహా కథనాలను ప్రచురించడం స్వాగతించదగ్గ పరిణామం కాదని విమర్శకులు దుయ్యబట్టారు. ఈ ఇండస్ట్రీలో తెల్లవారి, ముఖ్యంగా పురుషుల పెత్తనాన్ని సైతం సదరు ఉద్యోగి వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇక తమపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, గూగుల్ తన ఉద్యోగులకు ఓ లేఖను రాసింది. తమ సంస్థలో లింగ భేదం, జన్యుపరమైన తేడాలు లేవని, ఉద్యోగులంతా ఒకటేనని పేర్కొంది. వారి శక్తి, సామర్థ్యాలకు, నైపుణ్యతకు మాత్రమే పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News