: కుమార్తె పెళ్లికి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా దంపతులను ఆహ్వానించిన టెక్సాస్ మహిళ.. రిప్లై చూసి మురిసిపోయిన పెళ్లికూతురు!


పెళ్లి జరగబోయే ఇళ్లలో ఉండే సందడి మనకు తెలుసు.. వివాహానికి ఎవరెవరిని ఆహ్వానించాలన్నది మొదలు, పెళ్లి తంతు పూర్తయ్యే వరకు ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. కొత్త, పాత స్నేహితులు, బంధువులు.. ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ గుర్తుంచుకుని మరీ శుభలేఖలు పంపిస్తారు. ఇంత చేసినా ఎవరో ఒకరిని మర్చిపోతుంటారు... అయితే టెక్సాస్‌కు చెందిన లిజ్ విట్లో మాత్రం మర్చిపోలేదు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సైతం తన కుమార్తె వివాహ శుభలేఖ పంపింది.  

ఈ ఏడాది మార్చిలో లిజ్ విట్లో తన కుమార్తె బ్రూక్ అలెన్‌కు వివాహం జరిపించింది. కుమార్తె పెళ్లి ఏర్పాట్లను గతేడాది డిసెంబరులోనే ప్రారంభించిన ఆమె  అందరికీ పంపినట్టుగానే అధ్యక్షుడు ఒబామా దంపతులకు కూడా శుభలేఖ పంపింది. అయితే ఈ విషయం బ్రూక్‌కు తెలియదు. పెళ్లి అనంతరం జూలై 27న ఒబామా నుంచి శుభాకాంక్షలు చెబుతూ వచ్చిన లేఖను చూసిన బ్రూక్ ఉబ్బితబ్బిబ్బయింది. సంతోషం పట్టలేక ఎగిరి గంతేసింది. ఒబామా, మిషెల్లీ సంతకాలతో ఉన్న ఆ లేఖలో నూతన దంపతులకు ఒబామా దంపతులు  శుభాకాంక్షలు తెలిపారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వారి బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. బ్రూక్ ఆ లేఖను ఆనందంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది.  

  • Loading...

More Telugu News