: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. నేటి నుంచి వర్షాలే వర్షాలు.. సముద్ర తీరంలో ఎగసి పడుతున్న అలలు!
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. దక్షిణ బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి ఏడు కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల రుతుపవనాల్లో కాస్త చలనం ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కోస్తాంద్ర మీదుగా ఉన్న ద్రోణి కొనసాగుతోంది. దీనివల్ల వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
మరోవైపు అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో నేటి నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం దిశమార్చుకుని వాయవ్యం వైపుగా వచ్చిందని, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ తీరానికి దగ్గరగా ఉన్న ఉపరితల ఆవర్తనం అల్ప పీడనంగా మారినట్టు వాతావరణశాఖ అధికారులు వివరించారు. సముద్ర మట్టానికి ఏడు కిలోమీటర్ల ఎత్తున ఆవర్తనం ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక సముద్ర తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.