: కష్టపడకుండా.. దేవుడికి వంద కొబ్బరికాయలు కొడతానంటే కుదరదు!: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్
అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా కష్టపడి పని చేయడమే ముఖ్యమని తాను నమ్ముతానని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడింది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, ‘అదృష్టాన్ని నేను పూర్తిగా నమ్మను. అంకిత భావంతో కష్టపడితే మీ లక్ ను మార్చుకోవచ్చు. కేవలం, ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు లైఫ్ లో మనం కష్టపడితే..అదృష్టాన్ని మార్చుకోవచ్చు. అదృష్టం మన చేతుల్లోనే ఉంది. దేవుడిని నేను బాగా నమ్ముతాను. అయితే, మనం కష్టపడితే దేవుడు బాగా చూస్తాడు. కష్టపడకుండా .. దేవుడికి వంద కొబ్బరికాయలు కొడతాను, తిరుపతి కొండ ఎక్కుతానంటే కుదరదు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా కంటే ముందు ఏదేదో చేశాను, నాకే తెలియదు! మా నాన్న ఆర్మీలో ఉన్నప్పుడు .. ఎక్కువ సినిమాలు చూసేందుకు అవకాశమిచ్చేవారు కాదు. కాకపోతే, హీరోయిన్ ని కావాలని నాకు ఉండేది. నేను ఢిల్లీలో మోడలింగ్ చేసేటప్పుడు.. దక్షిణాది చిత్ర పరిశ్రమ ఇంత పెద్దదని నాకు తెలియదు. పాకెట్ మనీ కోసం కన్నడ సినిమాలో నేను మొట్టమొదటిసారిగా నటించాను. ఒక నెలలో ఐదు లక్షల రూపాయలు వచ్చేస్తాయి .. స్విఫ్ట్ కారు కొనుక్కోవచ్చు అనే ఊహాల్లో ఉన్నాను. అప్పటికీ, అసలు నాకేమీ తెలియదు... ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలుగు నుంచి ఆఫర్లు వచ్చాయి. అరవై రోజులు అయితే నేను నటించను, పది రోజులు అయితే నటిస్తానని వారికి చెప్పాను.. తెలుగులో మొట్టమొదటి సారిగా 'కెరటం' సినిమాలో నటించాను’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.