: హైదరాబాద్ లో కొకైన్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్టు
హైదరాబాద్ లో మరో డ్రగ్ ముఠా గుట్టురట్టయింది. ఇద్దరు నిందితులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు నైజీరియాకు చెందిన జాన్ బాస్కో కాగా, కాకినాడకు చెందిన మహ్మద్ జహరుల్లా అలియాస్ అజాజ్ మరొకరని తెలిపారు. ఈ రోజు వారిని మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మాట్లాడుతూ, ముంబై కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. వారి నుంచి 180 గ్రాముల కొకైన్, 4 ఫోన్లు, ఓ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 2014లో మహ్మద్ జహరుల్లా హైదరాబాద్ కు వచ్చాడని, ఇక్కడి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడని, ఈవెంట్స్ కు, పబ్స్ కు వెళుతూ కొకైన్ తీసుకోవడానికి ఇతను అలవాటుపడ్డాడని చెప్పారు. 2016లో జాన్ బాస్కోతో మహ్మద్ కు పరిచయం ఏర్పడిందని లింబారెడ్డి చెప్పారు.